V2News

Latest News

V2News

Post Top Ad

LightBlog

Monday, September 14, 2020

టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత

September 14, 2020
దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని TRS ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు . దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది.దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కింది.జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004 , 2008 లో దొమ్మాట నుంచి , 2009 , 2014 , 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు . 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు . 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు .2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ముత్యంరెడ్డి గత ఏడాది సెప్టెంబర్ లో అనారోగ్యంతో మరణించారు . 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు.సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ , మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది . మంత్రి హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యారు . కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కుల పంపిణీ , చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు . పార్టీ కేడర్ చెక్కు చెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తుల బుజ్జగింపు , ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు . ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు .
Read More

Monday, June 15, 2020

భారత దౌత్య సిబ్బంది ఆచూకీ లేకపోవడంపై కలకలం

June 15, 2020
 V2NEWS DESK : పాకిస్థాన్ లో ఈ ఉదయం ఇద్దరు భారత దౌత్య సిబ్బంది ఆచూకీ లేకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది. పనిమీద బయటికి వెళ్లిన ఆ ఇద్దరు అధికారులు తిరిగి రాకపోవడంతో పాకిస్థాన్ లో భారత హై కమిషన్ కార్యాలయంలో ఆందోళన నెలకొంది. వారిద్దరినీ గూఢచారులన్న నెపంతో పాక్ భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని భావించారు. ఇప్పుడా అనుమానమే నిజమైంది. భారత దౌత్య అధికారులు పాక్ ఐఎస్ఐ అధీనంలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వారిద్దరూ ఇస్లామాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు భారత హైకమిషన్ కు సమాచారం అందింది.

ఇద్దరు భారత అధికారులను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ రాయబారి సయ్యద్ హైదర్ షాకు హోంమంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. ఇస్లామాబాద్ లోని ఇద్దరు భారత దౌత్య సిబ్బంది బాధ్యత పాకిస్థాన్ దేనని, విచారణ పేరుతో వారిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఇద్దరినీ పూర్తి భద్రత నడుమ భారత హైకమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.

ఇదిలావుంచితే, భారత్ నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వారిద్దరినీ పాక్ విడుదల చేసింది. ప్రస్తుతం వారిద్దరూ భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
Read More

కరోనా పరికరాల పేరిట విజృంభిస్తున్నసైబర్ నేరగాళ్లు : సీబీఐ

June 15, 2020
కరోనా పరికరాల పేరిట సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారంటూ సీబీఐ అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. ఆన్ లైన్ లో ముందస్తు చెల్లింపులు చేయవద్దంటూ ప్రజలకు సూచించింది. కొవిడ్ పరికరాల పేరిట ముందస్తు చెల్లింపులకు సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తారని, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని సీబీఐ వెల్లడించింది. శానిటైజర్లలో ప్రమాదకర మెథనాల్ వాడుతున్నారని, చాలా చోట్ల నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిపింది. శానిటైజర్ల తయారీపైనా దృష్టి పెట్టాలని సీబీఐ రాష్ట్రాలకు సూచించింది.
Read More

ఇంటర్ ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం

June 15, 2020
తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆమోదం లభిస్తే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ ఫలితాల విడుదల తేదీని ఖరారు చేయనున్నారు. గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎంతటి విపరిణామాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, నాటి పొరబాట్లను పునరావృతం చేయరాదని తెలంగాణ సర్కారు, ఇంటర్ బోర్డు కృతనిశ్చయంతో ఉన్నాయి. కాస్త ఆలస్యమైనా, అన్నీ సరిచూసుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని సర్కారు భావిస్తోంది.
Read More

కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఉత్తమ్

June 15, 2020
V2NEWS DESK : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా టాస్క్ ఫోర్స్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తీర్మానించిన అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతులు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. పాత జిల్లా కేంద్రాలు అన్నింటిలో కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సాకుగా చూపిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
Read More

తెలంగాణలో రాజకీయ ప్రముఖులను వణికిస్తో న్న కరోనా

June 15, 2020
V2NEWS DESK : తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సామాన్యులనే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా దీని బారిన పడుతున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తొలుత దీని బారిన పడ్డారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ అని నిన్న నిర్ధారణ అయింది. తాజాగా ఈరోజు మరో కలకలం చెలరేగింది. మరో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కూడా కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో గణేశ్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకోగా... కరోనా పాజిటివ్ అని తేలింది. అదే ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డిని కలవడం వల్లే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కలిసిన అధికారులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Read More

మహారాష్ట్ర వరకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

June 15, 2020
V2NEWS DESK :నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Read More

కరోనా చికిత్సకు ధరలను నిర్ణయించారు

June 15, 2020
హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటి ధరలను నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9,000 తీసుకోవాలని చెప్పారు.

అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి  సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.
Read More

ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితే ఏర్పడితే ఏ మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఓ యువతి

June 15, 2020
V2DESK : కరోనా వైరస్ సోకి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితే ఏర్పడితే, ఏ మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఓ యువతి. దాదాపు రెండు వారాలు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఏఏ వస్తువులు తీసుకెళ్లాలన్న విషయమై ఆమె సలహాలు ఇస్తోంది. కొవిడ్-19 సోకి, నోయిడాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది రికవరీ అయిన ఆమె, ఆసుపత్రిలో ఏఏ వస్తువులు అవసరమవుతాయి? ఏం తీసుకెళ్లాలన్న విషయమై సూచనలు చెప్పింది. క్వారంటైన్ లేదా, ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి అయిన వేళ, మొబైల్ ఫోన్, పవర్ బ్యాంక్, చార్జర్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించిందామె. హాస్పిటల్ లో కాస్తంత వేడిగా ఉండే నీటిని ఇస్తుంటారు కాబట్టి, ప్లాస్టిక్ బాటిల్ బదులు, ఓ స్టీలు బాటిల్, గ్లాస్ ను వెంట తీసుకుని వెళ్లాలని, హాస్పిటల్ లో టిఫిన్, లంచ్, డిన్నర్ ఇస్తారని, మధ్యలో ఆకలైతే తినేందుకు, అందునా విటమిన్ సీ అధికంగా ఉండే పండ్లను కూడా వెంట తీసుకుని వెళ్లాలని సూచించింది. టాయిలెట్లలో వినియోగించుకునేందుకు సొంతంగా టవల్, సోప్, షాంపు, టూత్ పేస్టు, బ్రష్ తీసుకెళ్లడం తప్పనిసరని, పరిస్థితి విషమంగా లేకుంటే, ఏ దుస్తులైనా ధరించవచ్చు కాబట్టి, తగిన దుస్తులను కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాలని, ఇతరత్రా రుగ్మతలు ఉంటే అందుకు సంబంధించిన మందులను వెంట తీసుకెళ్లాలని తెలిపింది. 14 రోజులు ఉండాలి కాబట్టి, టైమ్ పాస్ నిమిత్తం చదువుకునేందుకు పుస్తకాలు, డ్రాయింగ్ వంటి యాక్టివిటీ బుక్స్, దైవ ప్రార్థన నిమిత్తం దేవుళ్ల ఫొటోలను తీసుకుని వెళితే ముందు చూపుతో ఉన్నట్టని చెప్పుకొచ్చింది
Read More