తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై బండి సంజయ్ విమర్శలు - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై బండి సంజయ్ విమర్శలు

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఆయన విమర్శించారు. దీనిపై సికింద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నిరసనకు దిగారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా నిరసిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. కేసీఆర్, జగన్ లు అన్నదమ్ములతో సమానమంటూ ఏపీ మంత్రి ఒకరు నిన్న చేసిన వ్యాఖ్యలను సంజయ్ ప్రస్తావించారు. ఈ అన్నదమ్ముులిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా దోచుకుంటున్నారో, ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో స్పష్టమవుతోందని అన్నారు. ఇద్దరు సీఎంలు రాజకీయ, ఆర్థిక లావాదేవీల పరంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల ప్రజల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, లేనిపక్షంలో ప్రజలు తిరగబడతారని సంజయ్ హెచ్చరించారు