లస కార్మికుల బృందం సమస్యలపై రాహుల్ గాంధీ ఆరా - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

లస కార్మికుల బృందం సమస్యలపై రాహుల్ గాంధీ ఆరా

లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నది వలస కార్మికులే. దేశంలో ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వలస కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీ ఆగ్నేయ ప్రాంతంలోని సుఖ్ దేవ్ విహార్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న వలస కార్మికుల వద్దకు వచ్చారు. ముఖానికి మాస్కు ధరించి వచ్చిన రాహుల్ గాంధీ ఫుట్ పాత్ లపై ఉన్న వలస కార్మికుల బృందం వద్ద కూర్చుని వారి వివరాలు కనుక్కున్నారు. వారిలో కొందరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు కాగా, మరికొందరు మధ్యప్రదేశ్ కు చెందినవారు. హర్యానాలోని అంబాలా నుంచి నడచి వచ్చిన వారు ఢిల్లీలో ఆగారు. తమతో రాహుల్ గాంధీ మాట్లాడడం పట్ల వలస కార్మికులు స్పందిస్తూ, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగారని, పస్తులతో చచ్చిపోతున్నామని ఆయనకు చెప్పామని వివరించారు. 50 రోజులుగా పనిలేదన్న విషయం వెల్లడించామని, కనీసం తమ కష్టాలు వినడానికి వచ్చిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారని మహేశ్ కుమార్ అనే వలస కార్మికుడు తెలిపాడు. కాగా, రాహుల్ గాంధీ వారితో మాట్లాడి వెళ్లిన తర్వాత వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడంపైనే వారిని ఆపామని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.