అమెరికా ఒత్తిడికి తలొగ్గిన చైనా... కరోనాపై దర్యాఫ్తుకు అంగీకారం! - V2News

Latest News

V2News

Wednesday, May 20, 2020

అమెరికా ఒత్తిడికి తలొగ్గిన చైనా... కరోనాపై దర్యాఫ్తుకు అంగీకారం!

కరోనాపై దర్యాఫ్తునకు అంగీకారం!

హైదరాబాద్ : ఎట్టకేలకు చైనా తలొగ్గింది. కరోనా వైరస్ మూలాలను కనుగోనేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలో నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాఫ్తును చేయించాలన్న తీర్మానానికి చైనా మద్దతు పలికింది. కరోనా వైరస్ వూహాన్ లోని ల్యాబ్ నుంచి లీక్ అయిందని ఆది నుంచి ఆరోపిస్తున్న అమెరికా, చైనాపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరిగ్గా స్పందించకుంటే, తామిచ్చే నిధులన్నీ నిలిపివేస్తామని కూడా అల్టిమేట్టం జారీ చేసింది.

ఇక కరోనాపై దర్యాఫ్తు జరిపించాలని ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ లు సంయుక్తంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఇప్పటివరకూ భారత్ సహా 130 దేశాలు మద్దతు పలికాయి. ఇంతవరకూ దర్యాఫ్తును వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా సైతం విచారణకు అంగీకరిస్తూ, తీర్మానాన్ని బలపరిచింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ఏకాకిగా నిలిచిన చైనా, చివరకు అందరితో కలసి నడిచేందుకే నిశ్చయించుకోవడం గమనార్హం.

అంతకుముందు అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడి, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టిడ్ రోజ్ ఎడ్ హానమ్ కు ట్రంప్ రాసిన లేఖ చైనాపై ప్రభావాన్ని చూపాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 30 రోజుల్లోగా డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని, తానేమీ చైనాను వెనకేసుకు రావడం లేదని, స్వతంత్ర సంస్థనేనని నిరూపించుకోవాలని ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్పందించకుంటే డబ్ల్యూహెచ్ఓకు రూపాయి కూడా నిధులు మంజూరు చేయబోమని ఆయన తేల్చి చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యత్వాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, చైనా దిగిరాక తప్పలేదు.

ఇదిలావుండగా, గతంలో చైనాలో సార్స్ ప్రబలిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగానే స్పందించింది. అప్పటి డైరెక్టర్ జనరల్ కఠినంగా వ్యవహరించి, చైనాకు విదేశీయుల ప్రయాణాలపై హెచ్చరికలు జారీ చేశారు. ఆ విషయాలను గుర్తు చేసుకున్న ట్రంప్, ప్రస్తుతం మాత్రం పరిస్థితి అలా లేదని, నేటి డీజీ చైనా మనిషిగా మారిపోయారని నిప్పుల వర్షం కురిపించారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడి చైనాపై పనిచేసింది.