ఆరోగ్య బీమా తనకెందుకు ఇవ్వరు : ప్రశ్నించిన ఢిల్లీలో ఓ శ్మశాన వాటిక సూపర్ వైజర్ - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

ఆరోగ్య బీమా తనకెందుకు ఇవ్వరు : ప్రశ్నించిన ఢిల్లీలో ఓ శ్మశాన వాటిక సూపర్ వైజర్

ఢిల్లీలో ఓ శ్మశాన వాటిక సూపర్ వైజర్ గా వ్యవహరిస్తున్న మహ్మద్ షమీమ్ ది విచిత్రమైన పరిస్థితి. తాను ఇప్పటివరకు 112 మంది కరోనా రోగులను, కరోనా అనుమానితుల మృతదేహాలను ఖననం చేశానని, తనకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయాలని కోరుతున్నారు. ఢిల్లీలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తున్నారని, తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రకటన తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు. తన షిఫ్టు ముగిశాక విధుల్లోకి వచ్చేందుకు ఎవరూ అంగీకరించకపోవడంతో తానే కొనసాగుతున్నానని వెల్లడించారు.

వందమందిని పైగా ఖననం చేస్తే నాలుగైదు పీపీఈ కిట్లు మాత్రం ఇచ్చారని, అవి సరిపోవని ఆరోగ్య శాఖను అడిగితే తమ సిబ్బందికే లేవు నీకేం ఇస్తామని అంటున్నారని షమీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఆ శ్మశాన వాటిక కమిటీ మాత్రం, అంత్యక్రియల సమయంలో మృతదేహాలకు దూరంగా ఉండాలని మాత్రం షమీమ్ కు సూచించిందట. తాను ప్రతిరోజూ కరోనా వైరస్ తో పోరాడుతున్నట్టే భావించాలని, తనకు కూడా ఆరోగ్య బీమా అమలు చేయాలని ఆ సూపర్ వైజర్ కోరుతున్నారు.